తాలిబన్ మద్దతుదారులకు టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మురళీధర్ రావు. 24న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రోమో, లోగోను ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఎంఐఎం నాయకులు తాలిబన్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు మురళీధర్ రావు. టీఆర్ఎస్ పాలనలో కేవలం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదని… దేశంలో ఎక్కడా లేని దుస్థితికి రాష్ట్రం దిగజారిందని మండిపడ్డారు.
అవినీతి అంటే కేసీఆర్ ఫ్యామిలీ అని.. మూసీనదిలో ఉన్న కాలుష్యంలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని విమర్శించారు. మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని.. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు మురళీధర్ రావు.