నోటీసులు, విచారణలు ఎదుర్కొన్న వారికి ప్రగతి భవన్ నిలయంగా మారిందని, కేంద్రాన్ని, రాజ్ భవన్ ను విమర్శించడం కేసీఆర్ సర్కారుకు పరిపాటైందని విమర్శించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైన కోర్టు మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తొమ్మిదేళ్లలో హైకోర్టు ప్రభుత్వానికి అనేక మొట్టికాయలు వేసిందన్నారు.
సీఎస్, అక్రమ కట్టడాలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అంశాల విషయంలో కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. గవర్నర్ ప్రసంగంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్న వాస్తవాలను ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించామని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుందని గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, ఆత్మహత్యలపై గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు పొందు పరచాలన్నారు. అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తెరపైకి తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.