కేసీఆర్ గొప్పగా, ఘనంగా చెప్పుకుంటున్న స్కీములేవి కొత్త స్కీములు కాదు, ఇతర రాష్టాల్లో అమలవుతున్నవే…
ఓం ప్రకాశ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు
కేసీఆర్, కేటీఆర్‌తో సహా టీఆర్ఎస్ నేతలు తమ పథకాల గురించి చాలా గొప్పగా చెబుతారు. దేశంలో ఏ రాష్టంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, అవేవో తమ మస్తిష్కంలో పుట్టినట్లుగా పోజులు కొడతారు. ప్రతి స్కీమును గులాబీ సర్కార్ మొట్ట మొదట ప్రవేశ పెట్టిన స్కీం అంటూ ఉపన్యాసాలు దంచి కొడతారు.
మనోళ్లు మహా గొప్పగా చెబుతున్న ఈ స్కీములన్నీ ఎన్నో రాష్టాల్లో ఎప్పటి నుంచో అమలవుతున్నాయి. తెలంగాణలో నిరక్షరాస్యులు అధికమనే అంచనాతో ఏం చెప్పినా నమ్ముతారనే నైజంతో ఈ తండ్రీకొడుకులు కోతలు కోస్తూనే ఉంటారు. దశాబ్దాల క్రితం నుంచే ఈ స్కీములు ఎన్నో రాష్టాల్లో అమలవుతున్నాయి. ఆయా కాలాల్లో ఆయా రాష్టాల ఆర్దిక పరిస్థితులు, అప్పటి ద్రవ్యోల్భణం, ధరలను బట్టి ప్రభుత్వాలు నగదును అందచేశాయి. అప్పటి కాలన్ని, ఇప్పటి నగదు మొత్తాలతో కొలవడం అవివేకమవుతుంది. ఏ ప్రభుత్వాలైనా ఆ కాలానికి అనుగుణంగా అక్కడి ప్రజల అవసరాలు తీరే విధంగా పథకాలు ప్రవేశ పెట్టాయి. నగథు మొత్తాన్నిఅందచేశాయి. ఢిల్లీ, కేరళ వంటి ప్రాంతాల్లో ఉచిత విద్య, వైద్యాన్ని అందచేస్తున్నారు. ఇక తెలంగాణలో అమలు అవుతున్న ఆయా స్కీముల పుట్టు పూర్వోత్తరాలను, మొదటగా అమలు చేసిన రాష్టాలను ఓసారి పరిశీలిద్దాం.
1. ఉచిత విద్యుత్
1990లో తమిళనాడులోని కరుణానిధి సర్కార్ రైతులకు ఉచిత విద్యుత్‌ను అందచేసింది. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించిన మొట్టమొదటి రాష్ట్రం అదే. ఇప్పటికీ ఈ స్కీమ్ అక్కడ అమల్లోనే ఉంది. తమిళనాడు తర్వాత 1997లో పంజాబ్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసింది. అక్కడ ఇప్పటికీ ఈ పథకం కొనసాగుతూనే ఉంది. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ ప్రభుత్వం 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చింది. 70 శాతం చిన్న కమతాలున్న తెలంగాణలో 9 గంటల విద్యుత్ సరిపోయేది.
2. బాలింతలకు అమ్మ ఒడి కింద 12 వేల రూపాయలు
తమిళనాడులో 3 జున్, 1989లో కరుణానిధి సర్కార్ ప్రారంభించిన స్కీమ్ ఇది. ముత్తులక్ష్మీ మెటర్నిటీ బెన్‌ఫిట్ స్కీమ్ పేరుతో బాలింతలకు 200 రూపాయలు అందచేశారు. ఇప్పుడు అక్కడ 18 వేలు ఇస్తున్నారు.
3. కల్యాణ లక్ష్మీ
ఇది కూడా కరుణానిధి సర్కార్ తమిళనాడులో 3 జున్, 1989లో ప్రారంభించింది. పేదింటి ఆడపిల్ల పెళ్లికి 5 వేల రూపాయలు అందచేశారు. అదే తండ్రిని కోల్పోయిన అమ్మాయిలకు 20 వేల రూపాయలు ఇచ్చారు. మూవలూర్ రామమిర్తం మ్యారేజ్ అసిస్టెన్స్ కింద 50 వేల వరకు పెంచుకుంటూ పోయారు. 1998లో మధ్యప్రదేశ్ సర్కార్ ‘లాడ్లి లక్ష్మీ’ యోజక, 2004లో వైయస్ బంగారు తల్లి స్కీమ్ పేరుతో లక్ష రూపాయల వరకు ఆర్దిక సహకారం అందచేసే వారు. ఇంకా చాలా రాష్టాల్లో ఎప్పటి నుంచే ఇంచు మించు ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నారు. నగదు ఇస్తే కట్నానికే పోతుందని సదుద్దేశ్యంతో కనీసం 50 వేల రూపాయల విలువ గల వస్తువులను పెళ్లికి కొనుగోలు చేసి ఇచ్చేవారు. ఉదాహరణకు బంగారు తాళి, కొత్త కుటుంభానికి అవసరమైన వస్తువులు.. ఇలా అందించేవారు.
4. కంటి వెలుగు
ఉచిత కంటి పరీక్షా పథకం 1969లోనే తమిళనాడులో ఆరంభించారు. పేదలకు ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలను ఉచితంగా చేయించింది కరుణానిధి సర్కార్.
5. రైతు బీమా
18 నుంచి 60 ఏళ్ల లోపు రైతులు మరణిస్తే 5 లక్షలు ఇచ్చే పథకం. ఆత్మహత్యలు చేసుకునే రైతు కుటుంభాలకు గతంలో ప్రభుత్వాలు నష్ట పరిహరం ఇచ్చేవి. సహజ మరణాలకు కూడా దీన్ని వర్తింప చేస్తోంది తెలంగాణ సర్కార్. అంతే కాని రైతు మరణాలను నిరోధించే పథకాలకు తిలోదకాలిచ్చారు. పంట నష్టపోతే పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి ఇవ్వకుండా చనిపోయాక ఇద్దాంలే అన్నట్లుగా రైతు బీమాను ప్రవేశ పెట్టారు. వాస్తవ సాగుదారులైన లక్షల మంది కౌలు రైతులను విస్మరిస్తున్నారు. ఇది రైతుల కన్నా ఇన్సురెన్స్ కంపెనీకే అధిక ఉపయోగకరంగా ఉంటుంది.
6. రైతుబంధు
కర్ణాటక, మహరాష్ట వంటి చోట్ల రైతులు నష్టపోకుండా పంటలకు గిట్టుబాటు ధర, బోనస్ కల్పిస్తున్నారు. ఇక్కడ మాత్రం కేసీఆర్ తెలివిగా అవే డబ్బులను ఎకరానికి 5 వేల చొప్పున పంచుతున్నారు. రైతు కష్టానికి మద్దతు ధర రాకుండా చేసి రైతు బంధు కోసం యాచించే దుస్థితికి అన్నదాతను దిగజార్చారు. దీంతో పాటు రైతు బంధు లబ్దిలో భూస్వాములకు సింహభాగం అందుతోంది. తెలంగాణలో 45 శాతం భూమి కేవలం 15 శాతం మంది భూస్వాముల చేతుల్లో ఉంది. అంటే రైతు బంధు నిధుల్లో సగం భూస్వాములకు, దొరలకే దక్కుతుంది.
ఇవి మచ్చుకు కొన్నే.. కేసీఆర్ అమలు చేస్తున్న స్కీములన్నీ ఏదో ఒక రూపంలో ఎన్నో రాష్టాల్లో అమలవుతూనే ఉన్నాయి. వాటినే తమ ఘనత చెప్పుకోవడం కేసీఆర్‌కే చెల్లుబాటు అవుతుంది. ఇతర రాష్టాల్లో అమలవుతున్న ఇతర మంచి స్కీముల సంగతిని దాచడం కూడా గులాబీ బాస్‌కే చెల్లుతుంది.