కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన స్కామ్ దేశంలోనే అతి పెద్దదని, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
2013లో కేసీఆర్, కేటీఆర్ కు కలిపి 60 ఎకరాల భూమి మాత్రమే ఉందని వారు చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లోని 600 ఎకరాల వివరాలు ధరణి పోర్టల్ లో లేవన్నారు రాజగోపాల్ రెడ్డి. మరి ఆ భూముల ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా తెలీడం లేదని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ ఐఎల్ ఎఫ్ఎస్ అనే ప్రైవేట్ సంస్థ చెప్పు చేతల్లో నడుస్తోందన్నారు. నిషేధిత జాబితాలోని భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్ పై గవర్నర్ తో పాటు ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికలో భాగంగా మునుగోడులో బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా దాదాపు 18 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కేసీఆర్ కుటుంబం ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. పథకం ప్రకారమే ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని దాని ద్వారా సామాన్యుల నుంచి భూములు లాక్కున్నారన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల విలువైన భూములు ఉన్నాయని వాటిని కూడా లాక్కోడానికి కుట్ర చేశారని విమర్శించారు బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.