మరో రెండేళ్ల పాలన మిగిలి ఉండగానే ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. పొత్తుల ఎత్తులపై చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్స్ పేరుతో మళ్లీ పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా.. బీజేపీ చీఫ్ నడ్డా పర్యటన ఆసక్తికరంగా మారింది. జనసేన, బీజేపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే.. ఏపీలో పొత్తులు, సీఎం అభ్యర్ధిపై ఇప్పుడే ప్రస్తావన అనవసరమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అంటున్నారు. ఎన్నికలు లేకుండా పొత్తులపై చర్చించాల్సిన అవసరం లేదన్నారు సత్యకుమార్. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో చాలామంది వైసీపీ నేతల్లో అసంతృప్తి ఉందన్నారు.
మూడేళ్లలో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి పొత్తుల అంశాన్ని తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా.. సింగిల్ గా వస్తారా..? గుంపులుగా వస్తారా..? అన్న డైలాగ్ లు ఎందుకు వస్తున్నాయన్నారు సత్య. ఎన్నికల సమయంలోనే సీఎం అభ్యర్ధులను నిర్ణయించాలంటున్నారు సత్యకుమార్.
ఎన్ని పొత్తులు కుదిరినా.. బీజేపీకి చెందిన వాళ్లనే సీఎం అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం ప్రకటిస్తోందని తెలిపారు. వైఎస్సార్ సీపీ వేసిన ట్రాప్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పడ్డారని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు కొంతమంది బీజేపీ నాయుకులు వైసీపీ ట్రాప్ లో పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి విషయం పవన్, కేంద్ర నాయకత్వం మాట్లాడుకోవాల్సిన అంశం అని అభిప్రాయపడ్డారు సత్యకుమార్.