ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. జగన్ బాల శివుడికి పాలు పట్టిస్తోన్న పోస్టర్ ను వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.
వైసీపీ ట్విట్టర్ లో హేళన చేస్తున్నట్లుగా బాల శివుడు చిత్రాన్ని ప్రదర్శించడంపై బీజేపీ ఫైర్ అయింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ పార్టీ హిందువులను ఉద్దేశ పూర్వకంగా అవమానించిందని, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు సోము వీర్రాజు.
కాగా సోమువీర్రాజు కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యనారాణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శివరాత్రి పోస్టింగ్ మీద బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో బీజేపీ చెప్పాలన్నారు. డబుల్ తత్వాలు, తప్పుడు విధానాలు తమవి కాదన్నారు. బీజేపీ దిగజారుడు, వక్రీకరణలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఎంపీ జీవీఎల్ అందరికంటే మేధావా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 శాతం విజయం తమదేనన్నారు. దీనిని రెఫరెండంగా తీసుకుని హడావిడి చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డామనేది అర్థంలేని ఆరోపణలని తేల్చి చెప్పారు. ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు బొత్స సత్యనారాయణ.