భద్రాచలం రాములవారిని ఆంధ్రప్రదేశ్ కి అప్పచెప్పి అప్పుడు రాజకీయాలు మాట్లాడాలని కేసీఆర్ ని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కి.. వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డుపడిన కేసీఆర్.. ఆంధ్రా అంటూ రాజకీయ కూని రాగాలు తీయడం ఏంటని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదంతో ఉన్మాదిలా వ్యవహరించిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై మాట్లాడటానికి సిగ్గుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సభలు, సమావేశాలపై వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే రోడ్లపై పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. సభలు, సమావేశాలు నియంత్రణ చేస్తూ తీసుకుని వచ్చిన జీవో పబ్లిక్ డొమైన్ లో ఎందుకు అప్ లోడ్ చేయలేదన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ కోణంపై అనుమానాలు వస్తున్నాయన్నారు.
రాజకీయ సభల్లో వరుసగా సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనకు కారణాలు అన్వేషణ చేయాలన్నారు. ఈ తరహా సంఘటనలు జరగకుండా చేయడానికి అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు సోము వీర్రాజు.