విశాఖపట్నం నగరంలో అన్యాక్రాంతం అవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ గెస్ట్ హౌజ్ ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని, దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం దాగి ఉందని వార్తలు వచ్చాయన్నారు సోము వీర్రాజు. ఈ భూముల విషయమై ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తీర్పును అమలు చేస్తున్నామని మీ మంత్రులు, అధికారులు చెపుతున్నారు.
కానీ 2016వ సంవత్సరంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయరాదని, వందల కోట్ల విలువైన భూములను రక్షించుకోవటానికి ప్రభుత్వం మరోసారి న్యాయపోరాటం చేయాలని, మీ పార్టీ విపక్షంలో ఉండగా డిమాండు చేసిందని ఆయన గుర్తు చేశారు. మీ పార్టీ నేత, మంత్రి గుడివాడ అమర్నాధ్.. మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భూములను ప్రభుత్వపరం చేయటానికి తగిన చర్యలన్నీ తీసుకుంటుందని పదే పదే చెప్తున్నారు. పాదయాత్ర సమయంలో విపక్ష నేతగా భూముల అన్యాక్రాంతంపై ప్రస్తావించి, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టటానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అది సరైన చర్య కాదని చెప్పారు.. ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోయారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతగా మీరు, మీ పార్టీ నేతలు చేసిన డిమాండ్లను విస్మరించి, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నారు. మీ ప్రభుత్వ అధికారులే నిషేధిత జాబితా (22 A) నుంచి ఆ భూములను తొలగించి వాటిని మీకు అనుకూలంగా ఉండే బిల్డర్లకు అప్పగించటానికి ప్రయత్నిస్తున్నారని మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి గత టీడీపీ ప్రభుత్వం ఆ భూములను తమ వారికి కట్టబెట్టడం కోసం చేసిన యత్నాలు బెడిసి కొట్టాయి. మళ్ళీ మీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో భూములను పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం మాని, సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో గత ప్రభుత్వం చేసిన యత్నాలనే మీ ప్రభుత్వం కూడా ఉద్దేశ్య పూర్వకంగా ట్యాంపరింగ్ చేసినా, సృష్టించిన దొంగపత్రాలకు ఊపిరి ఇచ్చే చర్యల ద్వారా భారీ భూదందాకు తెరలేపినట్లు స్పష్టం అవుతోందన్నారు. ఇంత జరుగుతున్నా కూడా వాటిని మీ జిల్లా అధికార యంత్రాంగం కనీసం అధికారికంగా ఖండించకపోవడంపూ భూ కుంభకోణం వాస్తవమేనని ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
విశాఖ నగరం నడిబొడ్డున వున్న దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు మీరు వెంటనే ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. మీరు స్వయంగా ఉన్నతాధికారులతో చర్చించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పునః సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి అధికారులతో ” స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్” ఏర్పాటు చేయాలన్నారు. అవసరమయ్యే న్యాయ ప్రక్రియ ఏ రకంగా తిరిగి జరపాలో విధాన రూపకల్పన చేసి, భూములను పరిరక్షణ కోసం ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. గతంలో టీటీడీ భూములు అన్యాక్రాంతం చేయడానికి కొందరు తిరుమలకొండపై వున్న భూములు మావే అంటూ, టీటీడీ భూములు ప్రైవేటు భూములుగా చూపే ప్రయత్నాన్ని టీటీడీ అధికారులు అడ్డుకున్నట్లే, రాష్ట్ర ప్రభుత్వం కూడా దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ దాఖలు చేసి, నిజాయితీగా పోరాటం చేసి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రూ.1500 కోట్ల రూపాయల పైబడి విలువైన విశాఖపట్నం దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు వీలుగా ముందుగా స్టే తీసుకు వస్తే తర్వాత కొంత కసరత్తు చేసి భూములను రక్షించుకునే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నామన్నారు. దీకిని సంబంధించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలా కానిపక్షంలో ఈ కుంభకోణంలో కొందరు అధికార పార్టీ నేతలే, జిల్లా యంత్రాంగంతో కుమ్మక్కై పావులు కదుపతున్నారని భావించవలసి వస్తుందన్నారు. అదే జరిగితే, ఆ భూముల పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. తదుపరి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని వెల్లడించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.