తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్లు ఎంతో గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకుంటున్న క్షమా బిందుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు తాను అనుకున్న ఆలయంలో పెళ్లికి నిర్వహకులు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. సీన్ లోకి బీజేపీ నేత సునీత శుక్లా ఎంటర్ అయ్యారు. బిందు పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలో జరగనివ్వమని అంటున్నారు.
ఇలాంటివి హిందూ ధర్మానికి విరుద్ధమని చెబుతున్నారు సునీత శుక్లా. బిందు మానసిక అనారోగ్యంతో ఉందని చెప్పారు. హిందూ సంస్కృతిలో అబ్బాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చని, అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. పెళ్లి కోసం బిందు ఆలయాన్ని ఎంపిక చేసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తనను ఏ దేవాలయంలో వివాహం చేసుకోవడానికి అనుమతించమని స్పష్టం చేశారు. ఇలాంటి వివాహాలతో హిందువుల జనాభా తగ్గుతుందని.. మతానికి ఎవరు విరుద్ధంగా ఏదైనా చేసినా చట్టం ఒప్పుకోదని గుర్తు చేశారు.
వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు.. జూన్ 11న తనను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం పెళ్లి కార్డులను కూడా ప్రింట్ చేసి పంచుతోంది. గోత్రిలోని ఆలయంలో వివాహ తంతు జరిపించాలని నిర్ణయించుకుంది. అయితే ఆ ఆలయ కమిటీ ఈ పెళ్లికి అనుమతి నిరాకరించింది. ఇలాంటి నిర్ణయాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న కారణంతో ఒప్పుకోవడం లేదు.
Advertisements
మరోవైపు ఈ స్వీయ వివాహంపై పలువురు సామాజిక కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, సోలోగామి(స్వీయ వివాహం) అనేది ఎప్పటికీ చట్టపరంగా సరైంది కాదంటూ లాయర్లు సైతం వాదిస్తున్నారు. అయితే తన వివాహానికి ఆలయ యాజమాన్యం అడ్డుచెప్పినా తగ్గేది లేదని అంటోంది క్షమా బిందు. ఆ ఆలయంలో పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. మరి బిందు తన వివాహం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.