ప్రగతి భవన్‌లో ఏడు ద్వారాలు దాటితే తప్ప కేసీఆర్ అనే దొర కనబడరని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో గడీల పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఐఏఎస్ పాసై కలెక్టర్లుగా పనిచేస్తున్న వాళ్లు కూడా కేసీఆర్‌కు పాదాభిషేకం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కమీషన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ నెల 24 నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.
రోహింగ్యాలను తరిమికొట్టాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను స్వామిగౌడ్ తిప్పికొట్టారు. తెలంగాణలోని రోహింగ్యాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు వస్తుంటే వారు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ముస్లింల పేరిట రోహింగ్యాలు, ఇతరులు అరాచకాలకు పాల్పడుతుంటే ముస్లిం పెద్దలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇవన్నీ ప్రజలకు వివరించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని స్వామిగౌడ్ స్పష్టం చేశారు.
అటు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కేసీఆర్‌పై మండిపడ్డారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, కేసీఆర్ ఇచ్చిన మోసాలను, దోపిడీలను ఎండగట్టి టీఆర్ఎస్ మీద సంగ్రామం చేయడానికే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరిట బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆమె చెప్పారు. కార్యక్రమంలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, సుధాకర్ శర్మ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.