శివసేనలో నెలకొన్న సంక్షోభం కారణంగా మహారాష్ట్రలో అఘాడీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆఖరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోలేనని చెప్పేసిన సీఎం ఉద్ధవ్.. అధికారిక నివాసాన్ని సైతం వదిలి వెళ్లిపోయారు. అయితే.. ఆ సమయంలో కరోనా నిబంధనలు పాటించలేదంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఠాక్రేకు కరోనా పాజిటివ్ అని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అదే విషయం గురించి వివరిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపైనా స్పందించారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలన్నారు. అనంతరం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతిల్లు మాతోశ్రీకి వెళ్లారు ఉద్ధవ్.
ఈ క్రమంలో.. ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులను కలిశారు. కారులో వెళ్తూ వారికి అభివాదం చేశారు. ఇలా చేయడం కరోనా నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా అభ్యంతరం తెలిపారు. దీనిపై ముంబైలోని బలబార్ హిల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
కొవిడ్ బారినపడిన సీఎం ప్రొటోకాల్ ప్రకారం ఐసోలేషన్ లో ఉండాలని అన్నారు తేజిందర్. ఎవరినీ కలవడానికి వీళ్లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లయింట్ కాపీని ఆయన ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ క్రమంలోనే సీఎంపై పోలీసులు కేసు నమోదు చేశారు.