భారత రాష్ట్ర సమితి పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. ముందుగా పోచమ్మ మైదాన్ లోని రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశం అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ లో రాణిరుద్రమ దేవి ఆశీస్సులు తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసును గురించి ప్రస్తావిస్తూ.. ప్రజల దృష్టి మరల్చేందుకు ఢిల్లీలో బీఆర్ఎస్ డ్రామా మొదలు పెట్టిందని విమర్శించారు. మోసం చేసిన వాళ్లను ప్రశ్నిస్తే తప్పుదారి పట్టించడంలో కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవొచ్చని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్.
తెలంగాణను కేసీఆర్ సర్కారు లూటీ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కాదు.. అలీబాబా నలభై దొంగల సర్కార్ అని తరుణ్ చుగ్ మండిపడ్డారు. దోచేయ్.. దాచెయ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బైబై చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారని జోస్యం చెప్పారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్.