పవర్ ఉందని కేసీఆర్ మిడిసి పడుతూ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. శనివారం కంకల్ లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తానే తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్.. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు లేనేలేరని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి అసభ్య పదజాలంతో భారత జవాన్లను కించపరిచిన దేశద్రోహి అని మండిపడ్డారు విజయశాంతి. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సపోర్ట్ చేసిన విషయాన్ని మరువొద్దన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని.. రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా ఇచ్చిన హామీలలో ఒక్కదానినైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు.
డబ్బు, అధికారం ఉందనే అహంకారంతో కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైరయ్యారు విజయశాంతి. ఓవైపు కొలువు రాక నిరుద్యోగులు, మద్దతు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో ఆయనకు ఝలక్ ఇవ్వడం ఖాయమన్నారు.