ఎవరూ పట్టించుకోని ఓ అనాథ శవాన్ని భుజాలపై కి.మీ దూరం మోసి, స్వచ్ఛంద సంస్థతో కలిసి అంత్యక్రియలు జరిపించిన మహిళా ఎస్ఐ పై ప్రశంసలు కురిశాయి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్ ఐ శిరీషను అభినందించారు. తాజాగా శిరీష తండ్రి ఓ ఇంటర్వ్యూలో తన బిడ్డను పోలీస్ చేయడానికి కర్తవ్యం సినిమా స్ఫూర్తి అంటూ కామెంట్ చేశారు.
దీనిపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. తన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణ ఇవ్వటం, తన బిడ్డను జనం మెచ్చే పోలీస్ అధికారిగా తీర్చిదిద్దటం తనకెంతో ఆనందం కలిగించిందన్నారు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు అభినందనలు అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు.