మెడికల్ కాలేజీల్లో పీజీ స్టూడెంట్స్ పై విపరీతంగా ఒత్తిడి పెరుగుతుందని అన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి. ఈ మేరకు ఆమె ఆదివారం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పీజీ స్టూడెంట్స్ వారానికి 48 పని గంటలే ఉండాలన్న జాతీయ వైద్య మండలి మార్గ దర్శకాలకు భిన్నంగా వారిపై పని భారం మోపుతున్నారని ఆరోపించారు.
దీనికి తోడు వేధింపులు, ర్యాగింగ్స్, సూసైడ్స్, గుండెపోట్లు వంటి రకరకాల పరిస్థితులను మెడికల్ స్టూడెంట్స్ ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థగా పేరున్న వరంగల్ కేఎంసీలో జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. మెడికో ప్రీతి కాల్ డేటా స్పష్టం చేస్తోందన్నారు విజయశాంతి.
కేఎంసీలో ఆమెకు ఎదురైన వేధింపులపై హెచ్ వోడీ, ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తనకు ఎదురయ్యే పరిస్థితులను తన తల్లిదండ్రులతో మాట్లాడిన కాల్స్ బట్టి అర్థం చేసుకోవచ్చాన్నారు.
కాలేజీల్లో తగినంత ప్రొఫెసర్లును నియమించడం లేదని చెప్పారు. ఈ పరిస్థితులపై తెలంగాణ సర్కార్ ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులన్నీ అభివృద్ధి కోసమేనంటున్న పాలకులు.. ఈ పరిణామాలకు ఏం జవాబు చెబుతారు? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు బీజేపీ నేత విజయశాంతి.