ప్రధాని మోడీ రాకతో తెలంగాణలో కాషాయ శకం ప్రారంభమైందన్నారు బీజేపీ నేత విజయశాంతి. మోడీ రాకతో తెలంగాణలో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని.. కేసీఆర్ నియంతృత్వ పాలనపై ప్రధాని ధ్వజమెత్తారని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిని ఒక ఫ్యామిలీ అణచివేయాలని చూస్తోందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారన్న విజయశాంతి.. ఒక్క ఆశయం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని వివరించారు. కానీ.. కేసీఆర్ నిరంకుశ పాలనలో ఎవరి ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆరోపించారు. తెలంగాణకు విముక్తి కావాలని.. కుటుంబ పాలనను, కుటుంబ పార్టీలను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ ప్రజలకు స్పష్టం చేసినట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తామన్నారు విజయశాంతి. మోడీ వస్తున్నారంటేనే కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతోందని చురకలంటించారు. అందుకే కర్ణాటకకు పోయి దాక్కున్నారని అన్నారు. కేసీఆర్ కు ఏం పని ఉందని బెంగుళూరు వెళ్లారన్న ఆమె.. సమస్యలు ఉంటే మోడీని కలిసి నేరుగా చెప్పుకోవచ్చు కదా నిలదీశారు.
ప్రతిదానికీ కేంద్రంపైన, ప్రధానిపైన ఆరోపణలు చేయడం తప్ప.. కేసీఆర్ కు ఇంకేం చేత కాదన్నారు. తెలంగాణలో పార్టీ కోసం కార్యకర్తలు పోరాడుతున్న తీరును మోడీ ప్రస్తావించడంతో కాషాయదళంలో కొత్త కళ కనిపిస్తోందని చెప్పారు. ఇదే ఉత్సహంతో కేసీఆర్ ను గద్దె దించి కాషాయ జెండాను ఎగరేస్తామన్నారు విజయశాంతి.