సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ పేరిట జనాలకు సీఎం కేసీఆర్ టోపీ పెట్టారని, ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఆయన తన నెత్తిన తానే టోపీ పెట్టుకున్నారని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మారిందే తప్ప ఆ పార్టీ పద్దతుల్లో, కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి మార్పులూ రాలేదన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోనే మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ మాత్రం ఎదగకుండా కట్టడి చేస్తూ వారిని కీలు బొమ్మల్లాగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ తయారు చేస్తున్నారన్నారు.
గతంలో ఏ ఆత్మగౌరవం పేరిట రాష్ట్రంలో కోసం పోరాటాలు చేశామో.. ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ఈ స్థాయికి అవమానించబడటం చాలా అన్యాయం, దుర్మార్గం, బాధాకరం కూడా కేసీఆర్ అని ఆమె అన్నారు. మీరు మారరు. ప్రజలే మిమ్మల్ని మారుస్తరు, గద్దె దింపి ఎల్లగొడ్తారన్నారు.
ఇక టీఆరెస్ పేరిట జనం నెత్తిన అసత్యాలతో అనునిత్యం టోపీ పెట్టే ఈ సీఎం గారు, ఈ మధ్య బీఆరెస్ పెట్టి తన నెత్తికి తనే టోపీ పెట్టుకుని తిరుగుతున్నరని ఎద్దేవా చేశారు. బీఆరెస్ అంటే భస్మాసుర రాష్ట్ర సమితి అని కావచ్చన్నారు. ఈ సొంత నెత్తికి కేసీఆర్ గారి టోపీ సంకేతమన్నారు.