కేసీఆర్ బీఆర్ఎస్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ నేత విజయశాంతి. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె.. సీఎంకు పలు ప్రశ్నలు వేశారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో.. మిగిలిన రాష్ట్రాల్లో అనవసర ప్రయత్నం అవుతుందనేది అందరికన్నా కేసీఆర్ కే ఎక్కువ తెలుసన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రయోగంతో తెలంగాణ ప్రాంతేతర పార్టీలకు రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల సానుకూలతను కేసీఆర్ ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.
దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు విజయశాంతి. పక్క రాష్ట్రాలలో స్వార్థంతో కేసీఆర్ చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల వల్ల.. తెలంగాణలో వేరే రాష్ట్ర పార్టీలపై మాట్లాడలేని పరిస్థితి తెచ్చుకున్నారని సెటైర్లు వేశారు. కానీ, తెలంగాణ సమాజం ఆ అవసరంలో లేదని తెలిపారు.
నిజమేంటో.. తీర్పు ఏంటో ప్రజలకు బాగా తెలుసన్నారు విజయశాంతి. ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర సమగ్రత, ఆత్మాభిమానపూరిత గౌరవాన్ని ఎప్పటికీ ఈ ప్రజలు కాపాడుకుని తీరుతారని తెలిపారు.
జాతీయ రాజకీయాలపై మక్కువతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఏపీలో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆఫీసులు ప్రారంభిస్తారని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలోనే విజయశాంతి తనదైన రీతిలో కేసీఆర్ పై సెటైర్లు వేశారు.