ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం నాంపల్లి స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఒక్క రోజు దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ కు మందు మీద ఉన్న దృష్టి ఆడబిడ్డలకు న్యాయం చేసే విషయంపై లేదని దుయ్యబట్టారు.
ఓటేసిన పాపానికి మహిళలకు మరణ శిక్ష వేయిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించని కేసీఆర్.. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆప్ నేత సిసోడియా కోసం మాట్లాడుతున్నారని విజయశాంతి ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్సీ కవితను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేసీఆర్ సిసోడియాకు మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. మద్యం, డ్రగ్స్ అమ్మకాలను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని, ఇంత నీచంగా వ్యవహరించేందుకు సిగ్గుందా.. కేసీఆర్? అంటూ ఆమె విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఎస్టీ బిడ్డ ప్రీతికి ఏం న్యాయం చేస్తారని విజయశాంతి ప్రశ్నించారు. ఈ దీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, అరవింద్ మీనన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహిళ నాయకురాళ్లు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.