తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. గురువారం ఆమె వనస్థలిపురంలోని మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబంలో మొదటి వికెట్ కూతురు కవిత నుండే ప్రారంభమైందని.. తర్వాత కొడుకు, అల్లుడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కవితను ‘లిక్కర్ డాన్’ గా అభివర్ణించారు విజయశాంతి. కవిత తప్పు చేసి తప్పించుకుందాం అనుకుంటుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులే అని దుయ్యబట్టారు. గంజాయి, డ్రగ్స్ కు ఈ రాష్ట్రం అడ్డాగా తయారు అయిందని వ్యాఖ్యానించారు విజయశాంతి. ఫామ్ హౌస్ లో ఉంటూనే సీఎం కేసీఆర్ 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
అవసరానికి పని చేయించుకొని అవతలికి పొమ్మంటడు కేసీఆర్.. మహిళలు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛను ఇచ్చే విధంగా సీఎం విధానాలు లేవని విమర్శించారు. కల్వకుంట్ల తండ్రీకొడుకులు మాట్లాడితే చిన్న పిల్లలు టీవీలు చూసే పరిస్థితి లేదన్నారు విజయశాంతి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేదని విమర్శించారు విజయశాంతి.
అధికార పార్టీ మహిళా సర్పంచ్ పట్ల అసభ్యంగా మాట్లాడిన ఓ ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా మహిళలను వదలకుండా వేధిస్తున్నారని వాపోయారు. ఏనాడైనా సీఎం కేసీఆర్ మహిళలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చేశాడా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ ఇదే విధంగా చలనం లేకుండా ఉంటున్నాడని విమర్శలు చేశారు బీజేపీ నేత విజయశాంతి.