మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై, మంత్రి ధర్మానపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా?, ఇది మీ ప్రభుత్వ నిర్ణయమా.. ధర్మానా అభిప్రాయమా?, ధర్మాన అభిప్రాయం అయితే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా? ఉద్ధానికి మీరు ఇచ్చిన హామీ నెరవేరిందా? అని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ఉత్తరాంధ్రకు మీరు ఏమి చేశారు? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అని ఆయన నిలదీశారు.
జగన్న తోడు అనేది కేంద్ర ప్రభుత్వ పథకమన్నారు. రూ.15 కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుందన్నారు. మీ దోపిడీకి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతున్నారా అని దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి చేస్తే వలసలు ఎందుకు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా చార్జీ సీటు వేస్తామన్నారు. రైతులు భూములను అమ్మకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. 22 ఏలో ఉన్న రైతు భూముల వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
అంశాల వారీగా విపక్షాలు కలవడం సాధారణంగా జరిగేదన్నారు. రాజకీయ అంశంగా ముడి పెట్టడం సరికాదన్నారు. టీటీడీలో గదుల అద్దె విపరీతంగా పెంచుతున్నారు. పెంచిన అద్దెలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అద్దెలు తగ్గించాలని ఈనెల 12వ తేదీన ఆందోళనలు నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తామన్నారు. అలాగే 23, 24 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి.. తీర్మానం చేస్తామన్నారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు.
అలాగే బీజేపీ నేతలపై కూడా దాడులు ఎక్కువయ్యాయన్నారు. శాంతిభద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబుకి అవసరమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిని అవమానించలేదా? ప్రధాని మంత్రి తల్లిని విమర్శించలేదా? అమిత్ షాపై రాళ్ల దాడి చేయించలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మోడీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ అని.. తక్కువ అంచనా వేయవద్దని సూచించారు విష్ణువర్ధన్ రెడ్డి.