ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఎలక్షన్స్ పై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
వైజాగ్ లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుపై విమర్శలు చేసిన వైసీపీ.. ప్రస్తుతం ప్రభుత్వ పెట్టుబడులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఓ సారి పెట్టుబడులకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి.
అనంతరం బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుందని ఆరోపించారు.
విశ్వ విద్యాలయం వీసీ.. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని.. వీటన్నింటి పైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. ఏపీకి మోడీ ఎంతో సహాయం చేస్తున్నారని.. అందరూ ఆలోచించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ పార్టీ కోసం వాడుకుంటుందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు పాకా వెంకట సత్యనారాయణ.