తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుతూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై పలు రాజకీయ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కేసీఆర్ పార్టీకి.. కేఏ పాల్ పార్టీకి తేడా లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని ఆరోపణలు చేశారు. అలాంటి కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీలో అడుగు పెడతారని ప్రశ్నించారు. స్పష్టమైన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడంటూ దూయబట్టారు. తెలంగాణ తల్లిని కర్నాటక, ఏపీ, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడుకి ఎలా తెస్తారో చెప్పాలన్నారు.
గతంలో తెలుగు తల్లి విగ్రహానికి చెప్పుల దండ వేసి చేతులు, కాళ్లు తొలగించిన వ్యక్తి కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎందరో మహనీయుల విగ్రహాలను తొలగించిన కేసీఆర్ వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విష్ణువర్థన్ రెడ్డి.
అలాగే ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్ముతో ఏపీలో ఫ్లెక్సీలు కడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.