నాకు టికెట్ ఇవ్వలేదు దేవుడా !

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశావాదుల ఏడుపుల పర్వం ప్రారంభమయింది. మీడియా ప్రెస్ మీట్లలోనే బావురుమంటున్నారు. తాజాగా విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో తన పేరు లేదంటూ ఓ నేత కన్నీళ్ళతో సహా తన బాధను వ్యక్తం చేశాడు. ఆయన పేరు శషిల్ జి.నమోషీ. గుల్బర్గా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు  తనకు టికెట్ లభిస్తుందని కొండంత ఆశతో ఉన్నాడు.

అయితే పార్టీ అధిష్టానం ఈయనకు బదులు సి.బి.పాటిల్ అనే మరో అభ్యర్థిని ఎంపిక చేసి టికెట్ ఇచ్చింది. అంతే ! మీడియా సమావేశంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. నమోషీ మద్దతుదారులు ఆయనను అనునయించి పక్కకు తీసుకుపోయారు. సోషల్ మీడియాలో ఈయన ‘ విలాప పర్వం ‘ వైరల్ అయింది. గుల్బర్గా డిప్యూటీ మేయర్ గా వ్యవహరించిన ఈ నేత సుమారు 12 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఇంత రాజకీయ చరిత్ర ఉన్న తనను పార్టీ నాయకత్వం విస్మరించిందన్నదే ఈయన బాధ..ఆక్రోశం !