– కేసీఆర్ జాతీయ పార్టీపై బీజేపీ కౌంటర్ ఎటాక్
– ప్రజల్ని మభ్యపెట్టేందుకేనంటూ సెటైర్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయపార్టీ దిశగా చేస్తున్న ఆలోచనపై బీజేపీ నేతలు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్.. దేశాన్ని మోసం చేయడానికి వెళ్తున్నారా అని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశంలో కుటుంబ పాలన చేసే పార్టీలకు స్థానం లేదని గ్రహించాలని హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు మార్మోగుతుంటే.. కేసీఆర్ టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని కులాలు, మతాల పేరుతో విచ్ఛిన్నం చేసి.. తమ తప్పులను ఇతరులపై వేస్తూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణకు ఏమి చేయలేని కేసీఆర్… దేశానికి ఏం చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం కేసీఆర్ విషం కక్కుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు.. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారని… అందుకోసమే జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో దోచుకున్నది సరిపోక దేశాన్ని పంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే జాతీయ పార్టీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఇప్పటికే వీఆర్ఎస్ ఇచ్చారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా దేశానికి మరోసారి నరేంద్ర మోడీనే ప్రధాని అవుతారని అన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. తెలంగాణలో నిధులు లేక కార్పొరేషన్లు మూగబోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో 54శాతం ఉన్న ఓబీసీలకు కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారు.. ఇదేనా కేసీఆర్ సామాజిక న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక ఫెడరేషన్ లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలను క్యాష్ చేసుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఒకవేళ జాతీయ పార్టీ పెడితే ఆయన వెంట ఎవరుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.