ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. వేలాది మందిని ఇండియాకు తీసుకొచ్చింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారతీయులను స్వదేశానికి చేర్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ కృషి. ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో అన్న మాటలపై బీజేపీ వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి.
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించారు కేసీఆర్. ఇదేదో ఎన్నికల కాలం అన్నట్లు.. కేంద్రంపై విమర్శలు చేస్తూ అనేక వరాలు ప్రకటించారు. మాటల సందర్భంలో ఉక్రెయిన్ విద్యార్థుల ప్రస్తావన తెచ్చి.. 20వేలకుపైగా పిల్లలు ఉక్రెయిన్ లో చిక్కుకొని పోయారు. వారంతా మెడిసిన్ చదువుకునేందుకు అక్కడకు వెళ్లారు.. తెలంగాణ నుంచి 740 మంది వెళ్లగా… కింద మీదపడి 700 మంది పిల్లలను టికెట్లు భరించి వాపస్ తీసుకువచ్చామని అన్నారు.
నిజానికి ఆపరేషన్ గంగా మోడీ సర్కార్ నిర్ణయం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చింది. ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపి ఆఖరికి కొన్ని గంటలు యుద్ధాన్ని నిలుపుదల చేయించి మరీ మనోళ్లను తరలించారు ప్రదాని మోడీ. మొత్తం 90 పైగా విమానాలలో 22,500 పైగా భారతీయులను సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చింది కేంద్రం. మరి.. కేసీఆర్ కింద మీద పడి టికెట్లు భరించి ఎవరిని తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు.
ఆపరేషన్ గంగా పేరుతో అంతా కేంద్రం చేస్తే.. తాను క్రెడిట్ కొట్టేయాలని కేసీఆర్ ప్రయత్నం చేయడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు డిస్ కంటిన్యూ కాకుండా.. భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తామని కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు కేసీఆర్. అయితే.. దీనికి కేంద్రంతో పనేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన చెప్తున్న పేద విద్యార్థులకు నిజంగా సాయం చేయాలనుకుంటే వెంటనే చేయొచ్చు.. దానికి అభ్యంతరం ఎవరు చెప్తారని.. అయితే.. కేంద్రానికి లేఖ రాయాల్సిన అసవరం ఏముందని అంటున్నారు.
మరోవైపు కేసీఆర్ ను నమ్మడానికి లేదని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సేవలు అందించేందుకే దిక్కులేదు.. విదేశాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సాయం చేస్తానని కేసీఆర్ చెప్పడం నమ్మశక్యంగా ఉందా? అనే ప్రశ్న వేస్తున్నారు. నిజంగా వారికి సాయం చేస్తే మంచిదే. అయితే.. ఆయా కుటుంబాలను బుట్టలో వేసుకోవాలని ప్రకటన చేసి ఉంటే మాత్రం తగిన శాస్తి జరుగుతుందని శాపనార్ధాలు పెడుతున్నారు. ఎందుకంటే.. 2014 అధికారం దక్కించుకున్న సమయం నుంచి ఇప్పటిదాకా అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ మర్చిపోయారని గుర్తు చేస్తున్నారు బీజేపీ నేతలు.