– కర్నాటక అల్లర్లపై కేటీఆర్ ట్వీట్
– బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్లేనని విమర్శ
– భైంసా సంగతేంటని బీజేపీ రివర్స్ ఎటాక్
నీతులు చెప్పడానికే.. ఆచరణలో మాత్రం ఉండదు. ఇది ఎక్కువగా రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. తమను మాత్రం నీతి, నీజాయితీకి కేరాఫ్ అడ్రస్ అని ప్రమోట్ చేసుకుంటూ.. ఎదుటి పార్టీల వాళ్లను అత్యంత అవినీతి నాయకులని బురద జల్లేస్తుంటారు. అచ్చం గురివింద సామెతలా అన్నమాట. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ అలాగే ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు.
కర్నాటకలో అసమర్థ ప్రభుత్వం ఉన్నందునే మతపరమైన హింసను అదుపు చేయలేకపోతోందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. హింస ఏ రూపంలో ఉన్నా తాము సహించమని, తప్పక ఖండిస్తామన్నారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నపై ఇలా స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకుంటారని.. బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్.
అయితే.. మంత్రి ట్వీట్ పై బీజేపీ శ్రేణుల నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వస్తున్నాయి. కర్నాటకలో ఉన్నది అసమర్థ ప్రభుత్వమే అయితే.. భైంసా అల్లర్ల సంగతేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకంటే అసమర్థ, చేతగాని ప్రభుత్వమని ఒప్పుకుంటున్నట్లేగా అని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కర్నాటకలో హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్తను అత్యంత కిరాతకంగా చంపేశారు. అతడి అంతిమయాత్రలోనూ రాళ్లు రువ్వారు. ఈ క్రమంలోనే అల్లర్లు జరిగాయి. 144 సెక్షన్ విధించి పరిస్థితులను చక్కబెడుతోంది అక్కడి ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటున్నారు బీజేపీ నేతలు.
భైంసాలో హిందువుల ఇళ్లను తగులబెడితే కళ్లప్పగించి చూసిన కేటీఆర్.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవ చేస్తున్నారు బీజేపీ నేతలు. పైగా భైంసాలో అల్లర్లకు కారణం హిందువులేనని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారని ఆనాటి విషయాలను గుర్తు చేస్తున్నారు. కొందరిపై కక్షసాధింపు చర్యగా పీడీ యాక్టు నమోదు చేస్తే.. హైకోర్టు మొట్టికాయలు వేసిన సంగతి మిర్చిపోయారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
భైంసా ఘర్షణల సందర్భంలో పరస్పర దాడులు జరిగినా కేవలం హిందువులపైనే కేసులు నమోదు చేసి.. చట్టాన్ని దుర్వినియోగం చేసింది ఎవరని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు.