తెలంగాణ బీజేపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఇష్టానుసారం ప్లాట్‌ఫారం స్పీచ్‌లు కొట్టడం కాదని.. తనకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గడ్, పంజాబ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్టీసీని విలీనం చేశాయా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అక్కడేమీ చేయకుండానే తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేస్తూ చచ్చిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు బీజేపీ, కాంగ్రెస్ వాళ్లే బాధ్యత వహించాలని సీఎం తెలిపారు.
ఇప్పుడున్న ఆర్టీసీ.. తెలంగాణ ఆర్టీసీనే!
‘బీజేపీ నేతల డ్రామాలు ఆడుతున్నారు. కేంద్రంలో ఓ విధంగా రాష్ట్రంలో మరో మాట చెబుతారా?. మోటార్ వెహికల్ చట్టం ఆమోదంలో నలుగురు బీజేపీ ఎంపీలు భాగస్వామ్యం కాదా?. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ లాంటి పార్టీలు కార్మికుల సమస్యలు ఆర్చేవాళ్లా.. తీర్చేవాళ్లా?. యూనియన్ల పనికిమాలిన డిమాండ్లతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాల అడ్వకేట్ తప్పుడు మాట మాట్లాడారు. ప్రభుత్వ చర్యను కోర్టు తప్పుబట్ట జాలదు..తప్పుబట్టలేదు. ఇక ఆర్టీసీకి 5 వేల బస్సులు.. ప్రైవేట్‌కు 5 వేల బస్సులుంటాయి. ఇప్పుడున్న ఆర్టీసీ.. తెలంగాణ ఆర్టీసీనే’ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.