– అత్యాచార ఘటనతో చిక్కుల్లో ప్రభుత్వం
– ఫోటోలు, వీడియోలు బయటకు ఎలా వచ్చాయి?
– ప్రభుత్వంపై పోలీసులు తిరగబడుతున్నారా?
– కేసీఆర్ సర్కార్ బలహీనపడుతోందా?
– ఆధారాలు బయటకు రావడం దేనికి సంకేతం?
ముచ్చటగా మూడోసారి గెలవాలని నానా తంటాలు పడుతోంది టీఆర్ఎస్. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అంటూ కొన్నాళ్లుగా తెగ హడావుడి చేస్తోంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పల్లెల్లో సందడిగా ఉంది. పీకే ఇచ్చిన సర్వేల తర్వాత టీఆర్ఎస్ సర్కార్ ఈ దూకుడు రాజకీయాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని తేలిపోవడంతో ప్రజాకర్షక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయితే.. ఏ అంశంలో దొరుకుతుందా? ఓ ఆటాడేసుకుందామని కాచుకూర్చున్న ప్రతిపక్ష నాయకులకు ఏదో ఒక విషయంలో దొరికిపోతూ పరువు పోగొట్టుకుంటోంది కేసీఆర్ సర్కార్. తాజాగా విపక్ష నేతలకు దొరికన అస్త్రం.. మైనర్ బాలిక అత్యాచారం.
పబ్ నుంచి బాలికను తీసుకెళ్లడం.. అత్యాచారం చేయడం.. ఆలస్యంగా విషయం వెలుగులోకి రావడం.. పూర్తిస్థాయి విచారణ జరగకుండానే ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం లేదని పోలీసులు తేల్చేయడం.. కీలకంగా మారిన ఇన్నోవా కారు విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం.. ఇలా ప్రతీ దాంట్లో ఎక్కడో ఒకచోట ఏదో ఒక అనుమానాన్ని తెరపైకి తెచ్చాయి ప్రతిపక్షాలు. నిందితులకు టీఆర్ఎస్, ఎంఐఎం బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ప్రభుత్వం, పోలీసులు అద్భుతమైన స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ ఘటనలో బీజేపీ ఓ అడుగు ముందుకే ఉంది. ముఖ్యంగా ఆధారాల విషయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పెద్ద సంచలనం.
మామూలుగా ప్రభుత్వం బలహీనపడటం అంటే వ్యవస్థల్లో ఇతరులకు సహకరించడమే. ఈ కేసులో ఆధారాల విషయంలో అదే జరిగింది. నిందితులను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అమ్మాయితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అవే రఘునందన్ రావుకు చేరాయి. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కి పడ్డారు. అవి ఎలా చేరాయన్నదానిపై అత్యవసర భేటీ కూడా నిర్వహించారు. ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కన్నా ఆధారాలు బయటకు వెళ్లడమే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసింది. బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది. నిజానికి పోలీసుల తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతున్నారని ప్రతిపక్షాలు తరచూ తిట్టి పోస్తుంటాయి. ఈ క్రమంలోనే కొందరు పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని.. సైలెంట్ గా ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే ఆ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ బాగా ప్రమోట్ చేస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోతే.. మారుమూల పల్లెల్లో ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా గత కొన్నాళ్లుగా జరిగిన ఘోరాలను సైతం గుర్తు చేస్తోంది. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం నేతల ప్రమేయం ఉంటున్నా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. చివరకు ఆయా పార్టీల నేతల వల్లే అవన్నీ జరుగుతున్నాయని తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తోంది బీజేపీ. ఇటు పబ్ లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపైనా టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు చూస్తోంది.