ఏపీ రాజకీయాల్లో కేసినో యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంటే.. వార్ లోకి బీజేపీకి కూడా ఎంటర్ అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నేతలతో కలిసి గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం రమేష్ సహా పలువురు నేతలను పోలీసులు నందమూరు దగ్గర అడ్డుకున్నారు. అయితే.. వాహనాల నుంచి దిగిన నేతలు కాలినడకను అక్కడకు వెళ్లేందుకు చూశారు. కానీ.. కలవపాముల దగ్గర మరోసారి పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీజేపీ నేతలు దాదాపు మూడు కిలోమీటర్ల మేర పోలీసు వలయాలను ఛేదించుకుని నడిచారు. అదనపు బలగాలతో పోలీసులు.. కలవపాముల దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడలో శాంతిభద్రతలను కారణంగా చూపుతూ తమను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సంక్రాంతి అంటే చీర్ డ్యాన్సులు కావని కొడాలి నాని తెలుసుకోవాలని సోము వీర్రాజు విమర్శించారు.