రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తుండగా… నెల్లిమర్ల జంక్షన్ వద్ద బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొండపైకి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామనటంతో వాగ్వాదం మొదలైంది. అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. విష్ణువర్థన్ రెడ్డిని అంబులెన్స్ లో తరలించారు. ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
రామతీర్థంలోని బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. సమీపంలో ఉన్న కోనేటిలో రాముల వారి శిరస్సును పూజారులు గమనించారు. దీంతో ఆలయాలపై దాడులు ఆపాలంటూ బీజేపీ సహా పలు పార్టీలు, సంఘాలు నిరసనలు చేపట్టాయి.