గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో కూకట్‌పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఫోరమ్ మాల్ దగ్గరకు వచ్చిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కారుపై దాడికి దిగారు. అజయ్, ఆయన అనుచరులు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ.. ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలు ధ్వసం చేశారు. చేతిలో డబ్బులు పట్టుకున్న ఓ టీఆర్ఎస్ కార్యకర్తను బీజేపీ కార్యకర్తలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో మంత్రి అజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. బీజేపీ కార్యకార్తలు కొద్ది దూరం వెంబడించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.