రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ గ్రామాల్లోకి వచ్చిన నాయకులకు ప్రజలు అడ్డుపడుకున్నారు. తాజాగా అడ్డగింపు సెగ విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ని అంటుకుంది.
అయితే.. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా తాండూరులో మంత్రి సబితా పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ నేతలు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకొని నిరసన తెలిపారు. జీవో 317 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసే వరకు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే నిరసన సెగలు ఎదురైతే రాబోయే ఎలక్షన్ లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ నిపుణులు చెపుతున్నారు.