సంచలనం రేపిన రామాయంపేట తల్లీకుమారుల సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి డీఎస్పీ నేతృత్వంలో ఈ అరెస్ట్ లు జరిగాయి. మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి సహా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
టీఆర్‌ఎస్ నేతల వేధింపులతో విసిగిపోయిన గంగం సంతోష్, అతని తల్లి కొద్ది రోజుల క్రితం కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోతూ సెల్ఫీ వీడియో తీసి తమ చావుకు ఏడుగురు కారణమని వారి వివరాలు చెప్పారు. జితేందర్ గౌడ్, యాదగిరి సహా ఏడుగురి వివరాలు తెలిపారు.
ఘటన తర్వాత మున్సిపల్ చైర్మన్ ఇంటిపై దాడి కూడా జరిగింది. మృతదేహాలతో బంధువులు నిరసన వ్యక్తం చేశారు. రాజకీయంగా కూడా దుమారం రేగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అరెస్ట్ ల విషయంలో వెనుకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆరుగురిని అరెస్ట్ చేయగా.. సీఐ నాగార్జున గౌడ్ పరారీలో ఉన్నాడు.
మరోవైపు రామాయంపేటలో బంద్ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బంద్ కి పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా షాపులు మూసేశారు వ్యాపారులు. అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే.. సంతోష్ కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు కలిశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని లేకపోతే సీబీఐ విచారణ కోరతామని హెచ్చరించారు. బీజేపీ నేతల వార్నింగ్ తర్వాత అరెస్ట్ ల పర్వం కొనసాగడం.. పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.