– బండిపై ఫైరవుతున్న సొంత పార్టీ నేతలు
– మరోసారి తెర పైకి లుకలుకలు
– అరవింద్ మాటలతో జత కట్టిన సీనియర్స్
– బండిది ఒంటెద్దు పోకడ అంటూ నిలదీత!
– బ్లాక్ మెయిల్ అధ్యక్షుడు అంటున్న పేరాల శేఖర్
– యూజ్ అండ్ త్రో మాదిరి సంజయ్ వ్యవహారం!
– ట్రిబుల్ ఆర్ ఇష్యూలో ట్రోలింగ్
నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుందని అంటారు పెద్దలు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే.. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. అలాగని అచితూచి వ్యవహరించకపోయినా.. ఏదిబడితే అది మాట్లాడినా.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒక్కోసారి పార్టీ కూడా తలనొప్పులు తప్పవు. అంతర్గత కుమ్ములాటలు కూడా బయటపడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అదే పరిస్థితి నెలకొందని అంటున్నారు రాజకీయ పండితులు.
స్వరం పెంచిన అరవింద్.. పలువురి సపోర్ట్!
రాష్ట్రంలోని మహిళలకు సంబంధించి తరచూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటారు బండి సంజయ్. కానీ, కవిత విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపాయి. బీఆర్ఎస్ పార్టీ ఆ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ రాజకీయం గట్టిగానే నడిపింది. బండి వ్యాఖ్యలు పార్టీకి భారీగా నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయనే వాదన బీజేపీలో మొదలైందని అంటున్నారు విశ్లేషకులు. ఈక్రమంలో ఎంపీ అరవింద్.. బండి వ్యాఖ్యల్ని ఖండించారని చెబుతున్నారు. అసలు, అరవింద్ అలా మాట్లడటం ఎవరూ ఊహించలేదు. కానీ, సంజయ్ తో ఉన్న విభేదాలు కట్టలు తెంచుకున్నాయని వివరిస్తున్నారు. అరవింద్ కి సపోర్ట్ గా పేరాల శేఖర్ రావు యాడ్ అయ్యారు. ఈయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘ధర్మపురి మాట్టాడింది వంద శాతం కరెక్ట్. కిషన్ రెడ్డి గారో, లక్ష్మణ్ గారో, ఇతర పెద్ద మనుషులు చేయాల్సిన పని ఆయన చేశారు. అధ్యక్షుడి పరిణతి లేని అసందర్భ మాటలు, వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ఈ పరిస్థితికి కారణం. మసీదు తవ్వకాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్మెయిల్ ఇష్యూలు, సెటిల్మెంట్స్, కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయ లోపం, వ్యక్తిగత ఆర్ధిక స్వార్ధం, యూజ్ అండ్ త్రో విధానం.. ఇవన్నీ మన పార్టీ సంస్కృతి కాదు. అయినా యథేచ్ఛగా నడుస్తున్నాయి. కరీంనగర్ గ్రానైట్ అవినీతిని నిలదీసి అంతర్గత ఒప్పందాలు చేసుకోవడం. రాజ్ న్యూస్ లో జూపల్లి రామేశ్వర్ రావు మైనింగ్ అక్రమాలంటూ ఇచ్చి.. తర్వాత సెటిల్మెంట్ చేసుకోవడం. రాజ్ న్యూస్ లో నలుగురు ముఖ్య బీజేపీ నాయకులతో కోట్ల పెట్టుబడులు పెట్టించి నట్టేట ముంచడం.. దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్టి కంటోన్మెంట్ వీసీ పోస్ట్ ని ఆర్థిక కారణాల వల్ల కొత్తవారికి ధారాదత్తం చేయటం, ఉద్రేకంగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ను చిత్తుగా ఓడించిన ఈటల రాజేందర్ అద్భుతమైన గెలుపు వాతావరణాన్ని ఖతం చేసిన తీరు, మాఫియా స్టైల్ కొత్త కార్య పద్దతి’’ లాంటివన్నీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి తాను సిద్ధమని సవాల్ చేశారు పేరాల. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్దతి మాయమైనప్పుడు సోషల్ మీడియా ఆధారమవుతుందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి మాదిరిగా ఉందని.. దీనికి రాష్ట్ర నాయకత్వం స్వయం కృతాపరాధాలే కారణమని తెలిపారు. కేసీఆర్ బీఆర్ఎస్ పతనం అవుతున్న ఈ సమయంలో ఇవన్నీ పార్టీలో జరుగుతుండడం మన దురదృష్టమని చెప్పారు. కేంద్ర పార్టీ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నా ఉపయోగించుకోలేకపోతున్నామంటూ అసహనం వ్యక్తం చేశారు పేరాల.
కమలనాథుల మధ్య విభేదాలెన్నో!
‘‘కిషన్ రెడ్డికి లక్ష్మణ్ కి పడదు.. సంజయ్ కి కిషన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి.. ఈటలకు సంజయ్ కి గిట్టడం లేదు.. సీనియర్స్ ని , పార్టీ మారిన వారిని కో ఆర్డినేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో వారిని వాడుకుంటున్నారు’’ అని అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. ఇవాళ ఎవరితో మంచిగా ఉంటారో.. రేపు ఎలా ఉండబోతుందో అర్థం కాక పార్టీలో కీలకంగా ఉండే నేతలు సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు చెబుతున్నారు. పార్టీ నేతల్లో విభేదాలు వచ్చినా.. వాటిని క్లోజ్ చేయాల్సింది పోయి పెంచి పోషిస్తున్నారనే డౌన్ ను కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. పార్టీలో ప్రధానంగా ఉండే టాప్ 20 మంది లీడర్స్ ఎడమొహం.. పెడమొహం అన్నట్టుగా ఉంటారని అంటున్నారు. సెంట్రల్ పార్టీ మొట్టికాయలు వేస్తుంది కాబట్టి బయటకు పొక్కకుండా చూసుకుంటున్నారని.. ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా పార్టీలో చాలామంది వారి అసంతృప్తిని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అరవింద్, పేరాల వ్యాఖ్యల తర్వాత అర్థం అవుతోందని వివరిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఇష్యూ.. బండిపై ట్రోలింగ్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘‘నాటునాటు’’ పాటకు తాజాగా ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో బండికి సంబంధించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయన అప్పట్లో మాట్లాడిన మాటలను ట్రోలింగ్ చేస్తున్నారు. బీజేపీకి భయపడితే ఆస్కార్ వచ్చేదా అంటూ చురకలు అంటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో బండి హాల్ చల్ చేశారు. కొమురం భీమ్ పాత్ర విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే థియేటర్లను తగులబెడతామని స్టేట్ మెంట్ ఇచ్చారు. ట్విస్ట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ రాగానే చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ సంజయ్ ట్వీట్ చేశారు. దీంతో ‘‘ఆనాడు బీజేపీ అన్న మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా..? భారతదేశం పేరు, తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మారుమోగేదా? బీజేపీ వాళ్లు ప్రస్తుతం అవార్డు రాగానే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. బెదిరించేది వాళ్లే.. అవార్డు రాగానే సంబరాలు చేసే ద్వంద నీతి వారిదే’’ అని సెటైర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆస్కార్ కి నామినేట్ చేయాలని సోయి కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు లేకుండా పోయిందని దుయ్యబడుతున్నారు. గుజరాత్ సినిమా “ఛెల్లో షో”ను ఆస్కార్ కి నామినేట్ చేయడం పట్ల పక్షపాతం ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ స్వయంగా ఆస్కార్ కి అప్లికేషన్ పెట్టుకుని పోటీలో పాల్గొన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.