సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ మాటలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ అభినందన్ వర్తమాన్ వీరత్వం కన్నా మరో ప్రూఫ్ కావాలా అని ప్రశ్నించారు.
సుమారు 6 నెలల పాటు పాకిస్తాన్ నో ఫ్లై జోన్ ప్రకటించుకుందని ఇంతకన్నా నిదర్శనం కావాలని ప్రశ్నలు సంధించారు. మనల్ని రక్షించేందుకే కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలను సైతం త్యాగం చేశారని, దేశ రక్షణలో అమరులైన వీరులను అవమానించవద్దని సూచించారు.
ఇక సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించడం అమరవీరులను అవమానించడమే అవుతుందని కేసీఆర్ పై అసోం సీఎం హిమాంత బిస్వ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబంపై విధేయత చూపించుకోవడంలో కేసీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు.
పాకిస్తాన్ సైతం సర్జికల్ స్ట్రైక్స్ ను అంగీకరించిందని, కేసీఆర్ కు ఈ విషయం తెలియదా అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ ఎవరి వైపు ఉన్నారంటూ ప్రశించారు. పాకిస్తాన్ పైనే కేసీఆర్, కాంగ్రెస్ లకు విశ్వాసం చూపిస్తాయని మండిపడ్డారు.
సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న బలగాలపై సీఎం కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని, ఇది ఆపరేషన్ లో పాల్గొన్న వీర జవాన్లను అవమానించడమే అవుతుందన్నారు.