బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. సభలో ప్రసంగించిన బండి.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ఏం చేయలేనోడు దేశానికి చేస్తాడా అని నిలదీశారు.
రైతు బంధు ఇచ్చి.. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను కట్ చేశారని ఫైరయ్యారు. రాష్ట్ర రైతులను ఆదుకోని కేసీఆర్ పంజాబ్ వాళ్లకు మూడు లక్షలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో స్థానికులకు ఉద్యోగాలు రాలేదు గానీ ఆయన కుటుంబంలో అందరికీ వచ్చాయన్నారు. ఎన్ని పీడీ యాక్టులు పెట్టినా బీజేపీ భయపడబోదన్న సంజయ్.. కేసీఆర్ ను ఓడగొట్టేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గడీల పాలనను బద్దలు కొడతామని, ఇందుకు ప్రజలు బీజేపీకి సహకరించాలని కోరారు.
రాష్ట్రానికి కేసీఆర్ అమ్రీష్ పురిలా తయారయ్యారన్న సంజయ్..ఆయన పాలనలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించారో చెప్పాలని నిలదీశారు.
కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. కేంద్రం నుంచి సంక్షేమ పథకాల కోసం నిధులు వచ్చినా ఇక్కడ ఆగిపోతున్నాయని.. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు చోటు లేదన్న కేంద్రమంత్రి.. రాజస్థాన్ లో ఇద్దరు పార్టీ నేతలను ఏకం చేయలేని వారు భారత్ ను ఏకం చేస్తారా అని రాహుల్ జోడో యాత్రపై సెటైర్లు వేశారు.
ఇక కేసీఆర్ అడ్రస్ గల్లంతు చేసేదాకా బీజేపీ పోరాటం ఆగదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సీఎంకు దమ్ముంటే కొట్లాడాలని.. వక్రమార్గాల ద్వారా డబ్బు సంచుల ద్వారా ఇతర పార్టీలను నిలువరించాలని భావిస్తే వాళ్ల జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టారని.. మునుగోడులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని తెలిపారు ఈటల రాజేందర్.