తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలు, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ దాడి ఘటనపై కమలదళం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించాయి. పలుచోట్ల మైనంపల్లి దిష్టి బొమ్మ దహనం చేశాయి. ఎమ్మెల్యేగా ఉండి.. రౌడీలా ప్రవర్తించారని తీవ్రంగా తప్పుబట్టాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ దాని అనుబంధ సంఘాల నేతలు ఆందోళన నిర్వహిచారు. బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. ఎమ్మెల్యే మైనంపల్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు .. టీఆర్ఎస్ నేతలకు మద్యం సీసాలు ఎక్కడ దొరికాయని, జాతీయ పండగ రోజు కూడా టీఆర్ఎస్ నేతలు మద్యం సేవిస్తూ దేశాన్ని అవమానించారని మండిపడ్డారు. బీజేపీ కార్పొరేటర్‌పై దాడి చేస్తోంటే పోలీసులు మౌనంగా చూస్తుండిపోయారని ఆరోపించారు.
మైనంపల్లి కబ్జాలు, అవినీతిని బయటకు తీస్తామని.. అడుగు బయటపెట్టకుండా చేస్తామని బీజేపీ, బీజేవైఎం నేతలు హెచ్చరించారు. త్వరలో మైనంపల్లి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. మైనంపల్లి ఎమ్మెల్యేగా పనికిరారని, ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు.