బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు కౌంట్ డౌన్
రాష్ట్రానికి రానున్న అగ్రనేతలు.. అతిరథమహారథులు
తెలంగాణలో అధికార సాధన కోసం కసరత్తు
34 కమిటీల సమన్వయంతో కార్యాచరణ అమలు
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు కౌంట్ డౌన్ మెదలైంది. సమావేశాలకు మరో వారం మాత్రమే సమయం ఉండటంతో కమలనాథులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని భారీబహిరంగ సభకు రంగం సిద్ధమైంది. మోడీ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని తెలంగాణ బీజేపీ నేతలంటున్నారు.
తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈనేపథ్యంలో జులై 2,3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సమావేశాల కోసం కమలనాథులు కసరత్తు ముమ్మరం చేశారు. కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఇప్పటికే అధిష్టానానికి తెలంగాణ బీజేపీ నాయకులు నివేదిక అందజేశారు.
బిజెపి కార్యవర్గ సమావేశాల కోసం రెండు రోజుల ముందుగానే బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు రాబోతున్నారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈనేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీ నోవాటెల్ వరకు జేపీ నడ్డాకు భారీ స్వాగత ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. జులై 1వ తేదీ పార్టీ జాతీయ కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశంకానున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జేపీ నడ్డా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తెలంగాణ బిజెపి 34 కమిటీలను నియమించింది. బీజేపీ జాతీయ నేత అర్వింద్ మీనన్ హైదరాబాద్ లోనే మకాం వేసి 34 కమిటీలతో సమన్వయం చేస్తున్నారు. బిజెపి అగ్రనేతలు రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్న నేపథ్యంలో ఏర్పాట్లకు లోటు లేకుండా చూస్తున్నారు.
మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ సభ విజయవంతం చేసేందుకు బిజెపి శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అధ్యక్షుడు బండి సంజయ్ ఇంచార్జ్ లను నియమించారు. జులై 3వ తేదీ సాయంత్రం జరగనున్న ప్రధాని మోడీ సభ కోసం 10లక్షల మంది తీసుకురావాలని తెలంగాణ బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. భారీబహిరంగ సభ కోసం జనసమీకరణ బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పగించారు. ఇంకోవైపు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సలహాలు తీసుకుంటున్నారు.
మరోవైపు జులై 2వ తేదీ మధ్యహాన్నం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి రాజ్ భవన్ కు చేరుకున్నాక.. ప్రధాని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత రోడ్డు మార్గంలో రాజ్ భవన్ నుంచి హైటెక్స్ లోని నోవాటెల్ కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రయాణం చేసే మార్గంలో భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేయనున్నారు. జులై 3వ తేదీ ఉదయం రెండో రోజు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ సహా.. కేబినెట్ మంత్రులు, జాతీయ పదాధికారులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు.. సుమారు 300మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈనేపథ్యంలో కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశల్లో చర్చించాల్సిన ముసాయిదాలపై కసరత్తు పూర్తి చేశారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. ఈ ఏడాది చివరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై కూడా కార్యవర్గ సమావేశాల్లో చర్చించి .. ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. కార్యవర్గ సమావేశాల ముగింపు తర్వాత జులై 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ భారీ బహిరంగసభ ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలో మోడీ తెలంగాణ సమాజానికి ఇవ్వబోయే మెసేజ్ పై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ సభలో .. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ లు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.
మొత్తానికి జులై 3వ తేదీ ప్రధాని మోదీ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా బిజెపికి అనుకూలంగా మారతాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు.