కేంద్ర నిధులను తెలంగాణ సర్కార్ దారి మళ్లిస్తోందని ఆరోపించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. పంచాయతీ రాజ్ చట్టంపై బుధవారం లక్డికపుల్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ అని విమర్శించారు. గతంలో సర్పంచ్ లకు ఎంతో మర్యాద ఉండేదని.. ఇప్పుడు కనీస విలువ లేకుండా పోయిందన్నారు.
కేసీఆర్ పాలనలో సర్పంచులు సెక్యూరిటీ గార్డు, వాచ్ మెన్లుగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎవరో తనకు తెలియదని.. కేసీఆర్, కేటీఆర్ లే అన్ని శాఖలు చూస్తున్నారని ఎద్దేవా చేవారు. సర్పంచుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన రాజ్యాంగ సవరణలు అమలుకావట్లేదని వాపోయారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
అనంతరం బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సర్పంచులు రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొస్తుందన్నారు. కేంద్ర నిధులు సర్పంచులకు అందకుండా కేసీఆర్ సర్కార్ దారిమళ్లించడం దుర్మార్గమన్నారు. సర్పంచులను కేంద్రం దగ్గరికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
సర్పంచులు చిన్న తప్పులు చేస్తే కాళేశ్వరం స్కాంలాగా అధికారులు భావిస్తున్నారన్నారు. కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ పెద్ద గడి అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చిన్న గడి అని విమర్శలు చేశారు బూర నర్సయ్య గౌడ్.