సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది ప్రసన్నను పరామర్శించారు బీజేపీ నేతలు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నేతలు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రసన్నపై దాడిని ఖండించారు బీజేపీ నేతలు. బుధవారం మల్కాజిగిరి కోర్టులో ఆమెపై మరో న్యాయవాది శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. ఇతను లాయర్ గా చేస్తూ టీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడని చెబుతున్నారు. ప్రసన్న బీజేపీ తరఫున నేరేడ్ మెట్ కార్పొరేటర్ గా పోటీ చేశారు.
కోర్టు ప్రాంగణంలోనే దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్. సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కారణంగానే ఎటాక్ చేసినట్లుగా బాధితురాలు చెప్పారు. ఈ ఘటనలో ప్రసన్నకు కంటి భాగం దగ్గర బాగా గాయాలయ్యాయి.
చాలా రోజుల నుంచి తనను వేధిస్తున్నారని.. పోలీసులను ఆశ్రయించినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు ప్రసన్న. టీఆర్ఎస్ జోలికొస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడేవాడని.. తన గురించి అసభ్యంగా ప్రచారం చేసేవాడని కన్నీళ్లు పెట్టుకున్నారు.