మేడ్చల్ జిల్లా అల్వాల్ లో రోడ్డుకోసం బీజేపీ నేతలు రిలే నిరాహారదీక్షకు దిగారు. రోడ్డు వేయండి మహాప్రభో అంటూ బ్యానర్ పెట్టి నిరసన తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు కాలనీ ప్రెసిడెంట్ తో కలిసి దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
అల్వాల్ మున్సిపల్ పరిధిలోని 133వ డివిజన్ మచ్చబొల్లారం ప్రధాన రహదారి.. అల్వాల్ నుండి కొంపల్లికి వెళ్లే మార్గంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షం పడితే ఈ మార్గంలో నడిచే పరిస్థితి లేదని.. వాహనాలపై వెళ్లే సమయంలో కిందపడి ప్రజలు గాయాల పాలవుతున్నారని చెప్పారు.
ఈ మార్గంలో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే అవకాశం లేదని అంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.