తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.
ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని అన్నారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు ఎందుకు యాత్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మోడీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.
అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ డిప్రెషన్ లో ఉంటే.. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ టీమ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ, అవినీతి, రైతు, నిరుద్యోగ వ్యతిరేక పాలనని ఆరోపణలు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్న ఆయన.. ప్రధాని మోడీ నేతృత్వంలో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కలలు కనేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నదని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్.