భద్రాద్రి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన కుటుంబ బలవన్మరనానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవే కారణం అని బాధితుడు తీసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ ఇష్యూపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వనమా ఇంటి ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. తండ్రి అండతో అక్రమాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్న రాఘవను అరెస్ట్ చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలని.. అలాగే వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Advertisements
తన భార్యను పంపిస్తే ఆస్తి సమస్య పరిష్కరిస్తానని రాఘవ హామీ ఇచ్చాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొన్నాడు. ఎంతమందితో చెప్పుకున్నా నీ సమస్య పరిష్కారం కాదు. నీ ఆస్తిలో నయా పైసా కూడా నీకు రాదని బెదిరించారని చెప్పాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని ప్రశ్నించాడు.
ఈ మధ్య కాలంలో రాఘవ పేరు చెప్పి మరో వ్యక్తి చనిపోయాడు. నెల రోజులు దాక్కొని బెయిల్ పైన వచ్చాడు. ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ ప్రారంభించాడు. ఇలాంటి వ్యక్తి వల్ల లోకంలో సామాన్యులు ఎలా బతుకుతారు..? తట్టుకుని ఎలా నిలబడగలరు..? అని సెల్ఫీ వీడియోలో తన గోడును వినిపించాడు రామకృష్ణ.