ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు చూస్తుంటే గుండె చెరువైపోతోందన్నారు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి. 1996 నుంచి 2001 వరకూ అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు నేటికీ పీడకలలా వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు. మళ్ళీ నరరూప రాక్షసులైన తాలిబన్ల ఆటవికపాలన మొదలైందని.. మహిళల్ని లైంగిక బానిసలుగా చేసి, పిల్లల్ని కనే యంత్రాల్లా మార్చేసి, విద్య-ఉద్యోగాలకు దూరం చేసే దుర్మార్గపు రోజులు వచ్చేశాయన్నారు. అంతేకాదు నిబంధనలు పాటించని వారిని రాళ్లతో కొట్టి చంపడం, చిన్న తప్పులకే బహిరంగంగా కాళ్ళు, చేతులు నరకడం, మతగ్రంథంలోని నిబంధనలు అనుసరించకపోతే తల నరికేయడం, చెట్టుకు వేలాడదీసి ఉరివేయడం, బతికుండగానే తగులబెట్టడం లాంటి దారుణమైన మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు తాలిబన్లకు నిత్యకృత్యమని చెప్పుకొచ్చారు.
బురఖా ధరించని ఒక నడివయసు మహిళను తలపై కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని వివరించారు. ఇంతటి నీచ నికృష్టమైన తాలిబన్ల సర్కారును పాకిస్తాన్ గుర్తించి ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదు గానీ… కమ్యూనిస్టు దేశాలుగా చరిత్రకెక్కిన చైనా, రష్యాలు కూడా వంతపాడటం దౌర్భాగ్యమన్నారు. ఈ పరిణామాలపై మన దేశంలోని కమ్యూనిస్టు నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించలేదని చెప్పారు.

ఇక తాలిబన్లతో చర్చలకు అవకాశం ఉండాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సలహా ఇచ్చి తన సంస్కారాన్ని చాటుకున్నారని అన్నారు విజయశాంతి. తాలిబన్ల కంటే పలు రెట్లు అధికంగా ప్రభుత్వ సైన్యం ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు తోకముడిచాయని… ఇది పూర్తిగా దేశభక్తి, జాతీయవాద చైతన్యం లేని ఆ దేశ ప్రజల ఘోర వైఫల్యం తప్ప మరొకటి కాదని చెప్పారు. తాలిబన్లు కేవలం ఆఫ్ఘనిస్తాన్ తో ఆగిపోరని, చైనా, పాక్ తోడ్పాటుతో దీర్ఘకాలంలో వారి లక్ష్యం భారత్ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోందన్న ఆమె… ఈ పరిస్థితుల్లో భారతీయుల ఐక్యతే శ్రీరామరక్ష అని చెప్పారు.