సరూర్ నగర్ లో జరిగిన దళిత యువకుడి పరువు హత్య పాపులకు కఠిన శిక్షపడేలా చేయడంతో పాటు.. కుటుంబానికి అండగా ఉంటామని జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ విజయ్ సంప్లా పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నాగరాజు పరువు హత్య జరిగింది. అయితే.. శుక్రవారం నాగరాజు స్వస్థలం వికారాబాద్ జిల్లా మర్పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.
బాధితుని కుటుంబాన్ని విజయ్ సంప్లా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామితో కలిసి పరామర్శించారు. నాగరాజు భార్య అశ్రిన్ తో కలిసి మాట్లాడారు. పరువు కోసం నాగరాజును హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అశ్రిన్ కు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ యాక్టు ద్వారా కుటుంబానికి రూ. 8.25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
అందులో సగం దాదాపు రూ. 4 లక్షలు తక్షణమే అందేలా చూస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ. 5వేల ఫించన్ అందేలా చూస్తామని వివరించారు. నాగరాజు హత్య చేసిన నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని పట్టుకుని శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచిస్తామన్నారు.
మరోవైపు పరువు హత్యలో బలైన నాగరాజు కుటుంబాన్ని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల తదితరులు పరామర్శించారు. మృతుని భార్యను పలకరించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి వెంట.. వికారాబాద్ ఎమ్మెల్యే డా.ఆనంద్, ప్రజా ప్రతినిధులు ఉండగా కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ మోజెస్, జాతీయ ఎస్సీ కమీషన్ మాజీ సభ్యులు రాములు తదితరులు ఉన్నారు.