ఏపీలోని దేవాలయాల్లో తరచూ విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో తాజాగా జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో ఎక్కడా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
విగ్రహాలు ధ్వంసం చేయడం దారుణమని జగన్ అన్నారు. దేవుడితో ఆటలు ఆడితే ఆయనే శిక్షిస్తాడని చెప్పారు. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం.. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల్లో భయం కలిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని సూచించారు. సీఎంఓ అధికారులతో సమీక్ష సమావేశంలో జగన్ అధికారులకు ఇలా చెప్పారు.