త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే ఎన్డీయే లీడింగ్ లో ఉంటూ వస్తోంది. నాగాలాండ్ లో బీజేపీ-ఎన్ డీ పీపీ కూటమి దాదాపు క్లీన్ స్వీప్ కి దగ్గరలో ఉంది. ఈ రాష్ట్రాల్లో గట్టి భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మేఘాలయాలో 11 సీట్లలో నేషనల్ పీపుల్స్ పార్టీ ముందజలో ఉండగా 4 స్థానాల్లో యునైటెడ్ డెమాక్రాటిక్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మూడేసి సీట్ల చొప్పున, 2 స్థానాల్లో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.
త్రిపురలో సీఎం మాణిక్ సాహా , మేఘాలయాలో సీఎం కాన్రాడ్ సంగ్మా తమ సమీప అభ్యర్థుల కన్నా ముందంజలో ఉన్నారు. మేఘాలయాలో 12 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. త్రిపురలో తన సమీప ప్రత్యర్థి లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి కన్నా పాలక బీజేపీ భారీ సీట్లలో ముందుకు దూసుకుపోతోంది.
35 సీట్లలో ఈ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉండగా.. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 13 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ లో బీజేపీ-నేషనలిస్ట్ డెమాక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి 36 సీట్లలో ముందంజలో ఉంది. మేఘాలయాలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్ పీ పీ.. 25 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. త్రిపురలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలతో బాటు 40 సీట్లలో బీజేపీ దూసుకుపోతోంది.
త్రిపురలో మాజీ రాచరిక వంశస్థుడు ప్రద్యోత్ మాణిక్య దేబ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా 13 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకున్న సీపీఎం యత్నం బెడిసి కొట్టేలా కనిపిస్తోంది.