రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పెన్షన్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. ముస్తాబాద్ ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాల ముందు దరఖాస్తు దారులు నిరసనకు దిగారు. స్థానిక బీజేపీ నేతలు మద్దతు తెలపడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిరసన కారులను అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోపి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం కు సంబంధించి పెన్షన్ కోసం అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎవరు పట్టించుకోలేదని అన్నారు. దాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకురావడానికే ధర్నాను చేపట్టడం జరిగిందని చెప్పారు.
దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా అధికారుల దృష్టికి పంపించామని.. అది తమ పరిధిలో లేదని చెప్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ కు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇతర ప్రాంతాల అభివృద్ధిని చూసేందుకు వాహనాలను పెట్టేందుకు ముందుకు వచ్చిన మంత్రి.. అర్హులకు అందాల్సిన పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పాలని నిలదీశారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్ మంజూరు అయ్యేవరకు బీజేపీ పోరాటం చేస్తోందని హెచ్చరించారు గోపి.