తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీకి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత పోరే ఆయన రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.
ఎర్ర శేఖర్ గతేడాదే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అంతకుముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పనిచేశారు. మొదట్లో టీడీపీ నుంచి 1995లో ధన్వాడ ఎంపీపీ పని చేశారు. ఆ తర్వాత ఆయన సోదరుడు ఎర్ర సత్యం మరణంతో జడ్చర్ల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేస్థానం నుంచి 1999లో, 2009లో విజయం సాధించారు. 2004లో, 2008లో, 2014లో ఓటమిపాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీని వీడి 2019 ఆగస్టులో బీజేపీ గూటికి చేరారు.